traffic challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లిస్తున్నారా? ఆ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త!
- రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన
- నకిలీ వెబ్ సైట్లతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోన్న సైబర్ నేరగాళ్లు
- అప్రమత్తం చేస్తోన్న పోలీసులు
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వివిధ వాహనాలకు ప్రభుత్వం 90 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో చలాన్ల చెల్లింపులకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. గత నెల 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చు. వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో సైబర్ నేరగాళ్లు దీనిని ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్‌లతో చలాన్ల చెల్లింపుదారులను పక్కన పట్టించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తుండటాన్ని గుర్తించిన పోలీసులు... వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
కొంతమంది సైబర్ నేరగాళ్లు వాహనదారులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని... వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ల ద్వారా పేమెంట్స్ చేయవద్దని సూచించారు. పేటీఎం, మీసేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేయాలని సూచించారు. లేదంటే www.ehallan.tspolice.gov.in/publicview అనే వెబ్ సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలని కోరారు. నకిలీ వెబ్ సైట్‌ను ఎవరు సృష్టించారు? అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.