Atchannaidu: టీడీపీలో చేరడానికి చాలామంది వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు... కానీ!: అచ్చెన్నాయుడు

Atchannaidu talks about joinings in TDP
  • పార్టీలో చేరికలపై ఆచితూచి వ్యవహరిస్తున్నామన్న అచ్చెన్నాయుడు
  • రెండు కమిటీలు వేశామని వెల్లడి
  • కమిటీల అభిప్రాయాలు, అధినేత నిర్ణయమే అంతిమం అని స్పష్టీకరణ 
  • మరో వారంలో చేరికలపై స్పష్టత వస్తుందని వివరణ
ఏపీలో ఎన్నికల దిశగా విపక్ష టీడీపీ చకచకా అడుగులు వేస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ... తమ ఉమ్మడి కార్యాచరణను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రా... కదలి రా... పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ నెల 5 నుంచి ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విడుదల చేశారు. 

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేశారు. 

"100 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరిదశకు చేరిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 100రోజుల్లో ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుంది" అని వివరించారు.

టీడీపీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం: అచ్చెన్నాయుడు

తెలుగుదేశంలో చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ మేమే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పార్టీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం. కమిటీల అభిప్రాయాలు, అధినాయకుడి నిర్ణయమే అంతిమం. పార్టీ నేతలతో సంప్రదించాకే కొత్తవారి చేరికపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. తెలుగుదేశంలో చేరే ఇతర పార్టీల నేతలపై మరో వారంలో ఒక స్పష్టత వస్తుంది. 

సొంత పార్టీ నాయకులకే ఈ ముఖ్యమంత్రిపై విశ్వాసం లేదు. ఈ రోజో, రేపో తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నానన్నాడు... మరలా పిల్లిలా వెనకడుగు వేశాడు. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాలకు భయపడినట్టున్నాడు.

టీ.ఎన్.టీ.యూ.సీ  బస్సుయాత్ర

టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం తర్వలోనే బస్సుయాత్ర చేపట్టనుంది. దానికి సంబంధించిన పోస్టర్ ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. టీ.ఎన్.టీ.యూ.సీ నేతలు అన్నిరంగాల కార్మికులతో మాట్లాడి, టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలు... ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన మోసాల్ని వివరిస్తారు.

ఈ నెల 4న చంద్రబాబు చేతుల మీదుగా 'జయహో బీసీ' ప్రారంభం

ఈ నెల 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సమావేశం నిర్వహించబోతున్నాం. 4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం కానుంది. బీసీలను ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంత దారుణంగా వంచించారో, ఎంతగా వారిపై దమనకాండ సాగిస్తున్నారో ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేసి బలహీనవర్గాల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా టీడీపీ ఈ కార్యక్రమం చేపడుతోంది" అని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Atchannaidu
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News