Harish Rao: ఓటమి మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే... ప్రజలు మనల్ని గెలిపిస్తారు: హరీశ్ రావు
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపు
- విజయాలు.. అపజయాలు కొత్త కాదన్న మాజీ మంత్రి
- విద్యుత్ ఉచితమని చెప్పి... ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని విమర్శ
మన ప్రభుత్వం రాలేదని నిరాశవద్దని.. ఓటమి మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. భవిష్యత్తు మనదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దుబ్బాకలో నిర్వహించిన కృతజ్ఞత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని... మనం ఎన్నో విజయాలు, అపజయాలు చూశామని వ్యాఖ్యానించారు. మనకు పూల బాట తెలుసు.. అలాగే ముళ్ల బాటా తెలుసునన్నారు. బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు.
200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మాత్రం ముక్కుపిండి మరీ కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధు 15,000 ఇస్తామన్నారని.. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్‌కు రైతుల మీద ఉన్న ప్రేమ కాంగ్రెస్‌కి ఉందా? అని నిలదీశారు. రూ.4వేల ఫించన్ ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొమ్మిదో తేదీ నుంచి రూ.2 లక్షలు రుణమాఫీ అని చెప్పారని.. కానీ మాట తప్పారన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తుంటే తమకు తొందర ఎక్కువ అంటున్నారని... కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిందే తాను గుర్తు చేశానని స్పష్టం చేశారు.
తెలిసో.. తెలియకో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని... భవిష్యత్తు మనదే అన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు. ప్రజలు మళ్లీ మనల్ని కచ్చితంగా గెలిపిస్తారన్నారు. ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైందని... ఆ రెండు జాతీయ పార్టీలకు అధికారం కావాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.