Bandi Sanjay: అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదు: బండి సంజయ్
- బీజేపీపై విషప్రచారం చేసేవారి సంగతి పార్టీ చూసుకుంటుందన్న సంజయ్
- తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదని వెల్లడి
- ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం కష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్య
- లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 350కి పైగా సీట్లు గెలుస్తుందని ధీమా
- తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 స్థానాలు గెలుస్తుందన్న బండి సంజయ్
బీజేపీపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని... విషప్రచారం చేసేవారి సంగతి పార్టీ చూసుకుంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో కష్టపడ్డ వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. త్వరలో 20 వేల మందితో క్షేత్రస్థాయి కార్యకర్తల సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్‌ను కూకటివేళ్లతో పెకలిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగా లేదన్నారు.
ఉద్యోగుల వేతనాలకు కూడా డబ్బులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తుందనేది దేవుడెరుగు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం కష్టంగా కనిపిస్తోందని... అందుకే రేవంత్ రెడ్డి ముఖంలో నవ్వు కనిపించడం లేదన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఇబ్బందికరంగా మారుతుందన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ పేరుతో జరగబోతున్నాయన్నారు. ఏ సంస్థ సర్వే చేసినా 80 శాతానికి పైగా ప్రజలు మోదీనే తిరిగి కోరుకుంటున్నారన్నారు. మోదీ లేని భారత్‌ని ప్రస్తుతం ఎవరూ ఊహించుకోవడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని... బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనపు నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 350 స్థానాలు గెలుచుకుంటుందన్నారు.