Saurav Ganguly: ఛత్తీస్‌గఢ్ సీఎంతో సౌరవ్ గంగూలీ సమావేశం
- బుధవారం సీఎం విష్ణుదేవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీమిండియా మాజీ కెప్టెన్
- రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చ
- రంజీ ట్రోఫి నిర్వహణకు ప్రభుత్వం మద్దతు కోరినట్టు తెలిపిన గంగూలీ
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, క్రికెట్ వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ భేటీలో ఆర్థికమంత్రి ఓపీ చౌదరి, ఎమ్మెల్యే సంపత్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గంగూలీకి సీఎం విష్ణుదేవ్..రాష్ట్ర జంతువైన అడవి గేదె బొమ్మను బహూకరించారు. ఇక గంగూలీ సీఎంకు తన ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌ను ఇచ్చారు. సమావేశంలో ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను గంగూలీతో పంచుకున్నారు. జష్ఫూర్ జిల్లాలో హాకీపై ఆసక్తి, కొండ కోర్వా తెగ వారి విలువిద్యా నైపుణ్యం గురించి చెప్పారు. రాష్ట్రంలోని అటవీ, ఖనిజ సంపద గురించి చెప్పారు. ఇక తొలిసారిగా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన గంగూలీ అక్కడి నవ రాయ్‌పూర్ స్టేడియం బాగుందని అన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ తాను సీఎంను మర్యాపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తాను సీఎంను కలవడం ఇదే తొలిసారని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న రంజీ ట్రోఫీకి ప్రభుత్వ మద్దతు కూడా కోరినట్టు తెలిపారు.