deepadas munshi: తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి పదేళ్లు కష్టపడ్డారు: దీపాదాస్ మున్షీ
- తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అయిన తెలంగాణను ఏర్పాటు చేశామన్న దీపాదాస్
- సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసిన మున్షీ
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా శ్రమించాల్సి ఉందని సూచన
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడ్డారని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ అన్నారు. బుధవారం ఆమె టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష తెలంగాణ ఏర్పాటు అని.. దానిని మనం నెరవేర్చామన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేడర్ మరింతగా శ్రమించాల్సి ఉందని సూచించారు.
తెలంగాణలో.. హైదరాబాద్లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బోగస్ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మరింత టీమ్ వర్క్ అవసరమని అభిప్రాయపడ్డారు. మున్ముందు మరిన్ని కీలక ఎన్నికలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వం... పార్టీ సమన్వయంతో ముందుకు సాగాలని.. అప్పుడే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని హితవు పలికారు.