Akila Dananjaya: వన్డే జట్టులోకి తిరిగొచ్చిన శ్రీలంక మిస్టరీ స్పిన్నర్.. ప్రపంచకప్‌లో ఆడిన 8 మందికి ఉద్వాసన
- ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో పునరాగమనం
- భారీ మార్పులు చేసిన ఉపుల్ తరంగ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ
- కుశాల్ మెండిస్‌కు కెప్టెన్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు
శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అకిల దనంజయ, ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు. జింబాబ్వేతో బుధవారం నుంచి స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్ కోసం లంక బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈసారి జట్టుకు కుశాల్ మెండిస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కుశాల్ గతంలోనూ జట్టుకు సారథ్యం వహించినప్పటికీ ఈసారి అతడిని ఫుల్‌టైం కెప్టెన్‌గా బోర్డు ప్రకటించింది.
ఉపుల్ తరంగ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈసారి జట్టులో భారీ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన కాసున్ రజిత, ధనంజయ డి సిల్వా, దుసన్ హేమంత, మథీషా పథిరన, లాహిరు కుమార, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చమిక కరుణరత్నేకు ఉద్వాసన పలికి వారి స్థానంలో వనిందు హసరంగ, ప్రమోద్ మదుషాన్, జనిత్ లియనాగె, నువనీదు ఫెర్నాండే, సాహన్ అరాచ్చిగేకు చోటు కల్పించింది.
శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక, పాథుమ్ నిశ్శంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనీదు ఫెర్నాడో, దాసున్ షనక, జనిత్ లియనాగే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక, దుషమంత చమీర, దునిత్ వెల్లలాగే, ప్రమోద్ మధుషాన్, జెఫ్రీ వాండెర్సీ, అకిల దనజంయ, వనందు హసరంగ (ఫిట్‌నెస్‌ను బట్టి)