ADR Report: 2022-23లో బీజేపీకి రూ.250 కోట్లకు పైగా విరాళాలు: ఏడీఆర్ రిపోర్ట్
- రూ.90 కోట్ల విరాళాలతో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్
- వైఎస్సార్‌సీపీ, ఆప్, కాంగ్రెస్‌కు కలిపి రూ.17.40 కోట్ల విరాళాలు
- 2022-23లో ఎలక్టోరల్ ట్రస్టుల విరాళాలను వెల్లడించిన ఏడీఆర్ రిపోర్టు
కేంద్రంలోని అధికార బీజేపీకి 2022-23లో రూ.250 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) రిపోర్ట్ వెల్లడించింది. ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 70 శాతానికి పైగా కాషాయ పార్టీకే చేరిందని తెలిపింది. ఇక కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్‌కు దాదాపు 25 శాతం లేదా రూ.90 కోట్ల విరాళాలు అందాయని పేర్కొంది. బీజేపీకి రూ.259.08 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.90 కోట్లు అత్యధికంగా అందాయి.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్, ఆప్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు మొత్తం రూ.17.40 కోట్లు అందుకున్నాయని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. 2022-23లో మొత్తం రూ.363 కోట్లకు పైగా విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు అందాయని ఎలక్టోరల్ ట్రస్ట్‌ల రిపోర్టులను బట్టి తెలుస్తోంది. 39 కార్పొరేట్, బిజినెస్ హౌస్‌లు విరాళాలను అందించిన జాబితాలో ఉన్నాయి.
34 కార్పొరేట్, వ్యాపార సంస్థలు ‘ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్’కు రూ.360 కోట్లకు పైగా, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఒక కంపెనీ రూ.2 కోట్లు, పరిబర్తన్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు రూ.75.50 లక్షలు, ట్రింప్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు రూ.50 లక్షలు విరాళంగా అందించినట్టు ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది.