Gorantla Madhav: సజ్జల రామకృష్ణారెడ్డితో నేను గొడవపడలేదు: గోరంట్ల మాధవ్
- చావో, రేవో వైసీపీలోనే అన్న గోరంట్ల మాధవ్
- త్వరలోనే జగన్ ను కలుస్తానని వెల్లడి
- పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందని ఆశాభావం
ప్రాణం పోయేంత వరకు వైసీపీలోనే ఉంటానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చావో, రేవో వైసీపీలోనే... పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. మళ్లీ టికెట్ కావాలని పార్టీ పెద్దలెవరిపైనా తాను ఒత్తిడి చేయలేదని తెలిపారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశానని... అయితే, ఆయనతో తాను గొడవ పడినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ ను కలుస్తానని అన్నారు.
అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశారని మాధవ్ చెప్పారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తనను తప్పించినా... పార్టీలో తనకు సరైన గౌరవం ఉంటుందనే భావిస్తున్నానని అన్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను వైసీపీలోనే ఉంటానని చెప్పారు.
హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా బళ్లారి మాజీ ఎంపీ శాంతను జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎంపీగా ఆమె పోటీ చేయబోతున్నారు. గోరంట్ల మాధవ్ కు ఏ స్థానాన్ని కేటాయిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు.