Ponnam Prabhakar: వారికి ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది: మంత్రి పొన్నం హామీ
- లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, సెలూన్‌లకు ఇస్తోన్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్న మంత్రి
- ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా
- రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న పొన్నం
గత ప్రభుత్వం కొందరికి ఇస్తోన్న ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుందని గుర్తు చేశారు. వీటికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ అధికారులు లాండ్రీలు, ధోబీ ఘాట్‌లు, సెలూన్లకు విద్యుత్‌ను కట్ చేయరని స్పష్టం చేశారు. రజక, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.