Brahmanandam: ఎవరయ్యా అతను? డిస్టర్బెన్స్ గా ఉంది... పంపించేయండన్న చిరు... బిత్తరపోయిన బ్రహ్మానందం
- తెలుగు చిత్రసీమలో హాస్య నట దిగ్గజంగా పేరుతెచ్చుకున్న బ్రహ్మానందం
- తన జీవితప్రస్థానంపై స్వయంగా పుస్తకం రాసిన వైనం
- 'నేను మీ బ్రహ్మానందమ్' పేరిట విడుదలైన బ్రహ్మానందం ఆటో బయోగ్రఫీ
తెలుగు చలనచిత్ర సీమ పుస్తకంలో బ్రహ్మానందం తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. కమెడియన్ గా ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసిన ఆయన, గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని, తన మూలాలను బ్రహ్మానందం అక్షరబద్ధం చేశారు.
ఇటీవలే ఆయన ఆత్మకథ 'నేను మీ బ్రహ్మానందమ్' పేరిట మార్కెట్లోకి వచ్చింది. ఎంతో లోతైన తాత్వికతతో ఆయన తన జీవితంలోని కీలక ఘట్టాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలో, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో తన పరిచయాన్ని, ఆయనతో తన అనుబంధాన్ని ఆసక్తికరంగా వివరించారు.
"చిరంజీవితో నా పరిచయం ఒక ప్రహసనంలా జరిగింది. జంధ్యాల గారి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా 'చంటబ్బాయ్' షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. నేను కూడా జంధ్యాల గారితో కలిసి షూటింగ్ కు వెళ్లాను. అప్పటికే 'ఖైదీ' సినిమా వచ్చి ఉండడంతో చిరంజీవిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారితో కలిసి నేను కూడా సెట్స్ పై ఉన్న చిరంజీవిని చూస్తున్నాను.
కొత్త కుర్రాడు... కుర్రకారును ఉర్రూతలూగించడానికి వచ్చిన యువ హీరో చిరంజీవి! నేను ఆయననే కళ్లప్పగించి నోరు తెరుచుకుని ఒక వింతజీవిలా చూస్తున్నాను. పైగా ఆ రోజు చిరంజీవి చార్లీచాప్లిన్ గెటప్ లో ఉన్నాడు. చిరంజీవిని చూసి ఓ నవ్వు నవ్వాను... నా నవ్వు నాకే వింతగా అనిపించింది... చిరంజీవికి విచిత్రంగా అనిపించింది.
దాంతో ఆయన... ఎవరయ్యా ఇతను? ఆ ఎక్స్ ప్రెషన్ ఏంటి? డిస్టర్బెన్స్ గా ఉంది... పంపించెయ్యండి అన్నారు. దాంతో నేను బిత్తరపోయాను. వెంటనే జంధ్యాల గారు జోక్యం చేసుకుని... ఈయన బ్రహ్మానందం గారనీ... ఆర్టిస్టు. అత్తిలి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు అని పరిచయం చేశారు. చిరంజీవి వెంటనే కుర్చీలోంచి లేచి కరచాలనం చేశారు. ఆయన ఎందుకంత పెద్ద హీరో అయ్యారో అర్థమైంది. ఆయన నాలోని లెక్చరర్ ను గౌరవించారు.
ఇక 'చంటబ్బాయ్' షూటింగ్ గ్యాప్ లో చిరంజీవికి జంధ్యాల గారు నా గురించి చెప్పారు. నా జోకులను, నేను చేసే మిమిక్రీని చిరంజీవి గారు చాలా ఎంజాయ్ చేశారు. నువ్వు పెద్ద కమెడియన్ వి అవుతావు అన్నారు. ఆ సినిమా జరుగుతున్నన్ని రోజులు షూటింగ్ అయిపోగానే విశాఖలోని డాల్ఫిన్ హోటల్ కు వెళ్లేవాడిని... మనసారా నవ్వుకునేలా చిరంజీవికి ఎన్నో జోకులు చెప్పేవాడ్ని... అలా నేను చిరంజీవి అభిమానానికి పాత్రుడ్నయ్యాను" అంటూ బ్రహ్మానందం తన పుస్తకంలో వివరించారు.