Dr S.Somnath: ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించిన జేఎన్టీయూ
- రేపు జేఎన్టీయూ-హెచ్ స్నాతకోత్సవం
- 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో సోమ్ నాథ్ కు డాక్టరేట్ ప్రదానం
- సోమ్ నాథ్ సారథ్యంలో ఇస్రో ఖాతాలో ఘనతర విజయాలు
ఇటీవల కాలంలో ఇస్రో చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కావడం, సూర్యుడి గుట్టుమట్లు తెలుసుకునే ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టు సాఫీగా కొనసాగుతుండడం తెలిసిందే. అనేక రాకెట్ ప్రయోగాలు, విదేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టడం, భారత్ కు సొంత నిఘా వ్యవస్థ కోసం భారీ సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించడం వంటి కీలక ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో,ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమ్ నాథ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, ఆయనకు హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
జేఎన్టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.నరసింహారెడ్డి మాట్లాడుతూ, జనవరి 5న జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం డాక్టర్ సోమ్ నాథ్ ప్రసంగిస్తారని వివరించారు.