TS High Court: కానిస్టేబుల్ నియామక పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు
- మార్కులు కలపాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు
- ఓయూ సాయం తీసుకొని నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న హైకోర్టు
- అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని ఆదేశం
కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ సాయం తీసుకొని నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని... అభ్యంతరాలు ఉన్న నాలుగు ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది.
నాలుగు ప్రశ్నలకు ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లలో వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి కోర్టు దృష్టికి తీసుకు వెళ్లింది. అయితే ఈ అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో నాలుగు వారాల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.