Daggubati Purandeswari: షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై పురందేశ్వరి స్పందన
- షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకు అవసరంలేని విషయమన్న పురందేశ్వరి
- రాష్ట్రంలో బీజేపీని అభివృద్ధి చేయడం గురించే ఆలోచిస్తున్నామని వెల్లడి
- జనసేనకు తామేమీ దూరం జరగలేదని స్పష్టీకరణ
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిని మీడియా స్పందన కోరింది. షర్మిల ఏ పార్టీలో చేరారన్నది తమకేమీ ముఖ్యమైన అంశం కాదని పురందేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్నదాని గురించే తాము ఆలోచిస్తామని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన విషయం తమకు సంబంధించినంత వరకు అప్రస్తుతం అని పేర్కొన్నారు.
ఇవాళ విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ, ఏపీలో జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో జనసేనకు తామేమీ దూరం జరగలేదని స్పష్టం చేశారు.
ఇవాళ్టి తమ సమావేశానికి బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్ వచ్చారని, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకే నాదెండ్ల మనోహర్ కూడా వచ్చారని పురందేశ్వరి వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులను, పొత్తుల అంశాలను శివప్రకాశ్ కు వివరించామని, ఆయన ఈ వివరాలన్నింటిని బీజేపీ హైకమాండ్ కు తెలియజేస్తారని తెలిపారు.