Iowa School Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. తుపాకీతో రెచ్చిపోయిన టీనేజర్!
- ఐయోవా రాష్ట్రం పెర్రీ నగరంలోని స్కూల్లో గురువారం ఘటన
- ఘటనలో ఒక విద్యార్థి మృతి, స్కూల్ అడ్మినిస్ట్రేటర్ సహా ఐదుగురికి గాయాలు
- గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదన్న పోలీసులు
- నిందితుడు తనని తాను కాల్చుకుని మరణించి ఉండొచ్చని వెల్లడి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అయోవా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు తెగబడటంతో 11 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. గాయపడ్డవారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్, నలుగురు చిన్నారులు ఉన్నారు. అయితే, గాయపడ్డ వారెవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. పెర్రీ నగరంలోని ఓ పాఠశాలలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు 17 ఏళ్ల టీనేజర్ అని పోలీసులు తెలిపారు. అతడు తనని తాను కాల్చుకుని మరణించి ఉంటాడని భావిస్తున్నారు. ఇక గాయపడ్డ వారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నట్టు వెల్లడించారు. ఘటనా స్థలంలో పోలీసులకు ఓ ఐఈడీ బాంబు కూడా దొరికింది. టీనేజర్ తనని తాను కాల్చుకున్నాడని మాత్రం పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద ఓ హ్యాండ్ గన్, షాట్‌గన్ ఉన్నాయని చెప్పారు.
కాల్పుల సమయంలో స్కూల్లోనే ఉన్న ఓ విద్యార్థిని ఎవా ఆ భయానక అనుభవాన్ని మీడియాకు చెప్పింది. కాల్పుల శబ్దం వినగానే తాను తరగతి గదిలోకి వెళ్లి దాక్కున్నట్టు చెప్పింది. తరువాత బయటకు వచ్చి చూస్తే అక్కడంతా పగిలిన గాజు ముక్కలు, రక్తం మరకలు కనిపించాయని పేర్కొంది.
శీతాకాలం సెలవుల తరువాత పాఠశాల మొదలైన తొలి రోజునే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో శుక్రవారం స్కూల్‌కు సెలవు ప్రకటించారు. కాగా, వర్జీనియా రాష్ట్రంలోనూ ఇటీవల కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాల వద్ద 15 ఏళ్ల కుర్రాడు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపాడు. ఎడ్యుకేషన్ వీక్ కథనం ప్రకారం, అమెరికా 2018 నుంచి ఇప్పటివరకూ పాఠశాలల్లో 182 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి.