Narendra Modi: ప్రధాని మోదీ సాహసం... సముద్రంలో స్నార్కెలింగ్!
- లక్షద్వీప్ లో మంగళ, బుధవారాల్లో ప్రధాని మోదీ పర్యటన
- సముద్ర తీరంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదించిన వైనం
- తీరంలో స్నార్కెలింగ్ కూడా చేసిన మోదీ,
- నెట్టింట ఫొటోలు షేర్ చేసిన మోదీ, ఇదో అద్భుత అనుభవం అని వ్యాఖ్య
ప్రధాని నరేంద్ర మోదీ మంగళ, బుధవారాల్లో లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటూ సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా (స్విమ్మింగ్) చేశారు. సముద్ర తీరాన కాసేపు కూర్చుని సేద తీరారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
‘‘లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రజల కోసం నేనింకా ఎంతో కష్టపడి పనిచేయాలని ఈ వాతావరణం నేర్పింది. సాహసాలు చేయాలనుకునే వారు..మీ జాబితాలో లక్షద్వీప్‌ను కూడా చేర్చండి’’ అని మోదీ అన్నారు. ఇది ఎంతో అందమైన అనుభవం అని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు.
ఏమిటీ స్నార్కెలింగ్..
స్నార్కెల్ అనే ట్యూబ్ పెట్టుకుని నీళ్లల్లో స్విమ్మింగ్ చేయడాన్ని స్నార్కెలింగ్ అంటారు. ఇందులో స్విమ్మర్ వాతావరణంలోని గాలి పీలుస్తూనే ఈత కొడతారు. నీటిలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు, జీవ రాశులను పరిశీలించేందుకు ఈ తరహా స్విమ్మింగ్ చేస్తారు.