Rohit Sharma: భారత్‌లో పిచ్‌లను విమర్శించేవారిపై రోహిత్ శర్మ ఫైర్.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు

Captain Rohit Sharma fires on who criticise indian pitches

  • ఇండియాలో పిచ్‌లపై బంతి స్పిన్ తిరిగితే దుమ్మెత్తిపోయడం సరికాదని కౌంటర్
  • పిచ్‌లకు రేటింగ్ విషయంలో తటస్థంగా ఉండాలని రిఫరీలకు చురకలు
  • ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు ఆతిథ్య దేశాన్ని బట్టి కాకుండా పిచ్‌లను బట్టి రేటింగ్ ఇవ్వాలని సూచన

కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు పట్టుమని 2 రోజులు కూడా కొనసాగలేదు. 5 సెషన్ల లోపే ఫలితం వచ్చేయడంతో టెస్ట్ ఫార్మాట్‌లో అతి తక్కువ సమయం కొనసాగిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. అయితే తొలిరోజే 23 వికెట్లు పడడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు బ్యాటింగ్ చేయడానికి భారత్‌, దక్షిణాఫ్రికా బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పరవాలేదనిపించినా రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది.

మొదటి రోజు నుంచే పిచ్‌పై సీమ్ లభించడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. కేప్‌టౌన్ పిచ్‌పై నేరుగా విమర్శలు చేయకపోయినప్పటికీ భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని విమర్శలు గుప్పించేవారికి గట్టి కౌంటర్లు ఇచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్ అత్యుత్తమమని చెబుతుంటారు. మరి దానికి కట్టుబడి ఉండాలి కదా. మీరు ఒక సవాలు విసిరినప్పుడు దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇండియాలో మొదటి రోజే పిచ్‌పై బంతి తిరగడం మొదలైతే దుమ్మెత్తి పోస్తారు. పిచ్‌పై దుమ్ము లేస్తోంది, పిచ్‌పై చాలా పగుళ్లు ఉన్నాయని అంటుంటారు’’ అని రోహిత్ శర్మ మండిపడ్డాడు.

‘‘ఎక్కడికి వెళ్లి ఆడినా తటస్థంగా ఉండటం చాలా కీలకం. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీలు ఇందుకు కట్టుబడి ఉండాలి. కొంతమంది రిఫరీలు పిచ్‌లను ఎలా రేట్ చేస్తారనేది వారు ఆలోచించుకోవాలి’’ అని రోహిత్ స్ట్రాంగ్‌గా స్పందించాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికైన అహ్మదాబాద్‌ పిచ్‌కు ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ‘బిలో యావరేజ్’ రేటింగ్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్ ఇవ్వడాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఒక బ్యాటర్ అక్కడ సెంచరీ సాధిస్తే అది పేలవమైన పిచ్ ఎలా అవుతుందని ప్రశ్నించాడు. కాబట్టి ఐసీసీ, మ్యాచ్ రిఫరీలు ఆతిథ్య దేశాన్ని బట్టి కాకుండా పిచ్‌లను బట్టి రేటింగ్ చేయడం మొదలు పెట్టాలని చురకలు అంటించాడు. కళ్లు, చెవులు తెరిచి ఆ విషయాలను పరిశీలిస్తారని తాను ఆశిస్తున్నట్టు  చెప్పాడు. 

కేప్‌టౌన్ లాంటి పిచ్‌లపై ఆడడం తమకు గర్వకారణమని, తటస్థంగా ఉండాలని చెప్పదలచుకున్నామని హిట్‌మ్యాన్ అన్నాడు. ‘ మొదటి రోజే బంతి తిరిగితే అది నచ్చదు. బంతిని సీమ్ చేయొచ్చు కానీ స్పిన్ అవకూడదనుకోవడం తప్పు’’ అని రోహిత్ అన్నాడు. మ్యాచ్ రిఫరీలు పిచ్‌లను రేట్ చేయడానికి ఉపయోగించే ప్రమాణాల గురించి తాను తెలుసుకోవాలనుకుంటున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ క్రిస్ బ్రాడ్ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా 2 టెస్టుల సిరీస్‌కు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించాడు.

  • Loading...

More Telugu News