Sunil Gavaskar: కేప్‌టౌన్ టెస్టు నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunil Gavaskar made Interesting comments in background of the Cape Town Test result
  • స్పిన్ పిచ్‌లపై బ్యాటింగ్ చేయలేకపోతే అసలైన బ్యాటర్ కాదన్న మాజీ దిగ్గజం
  • ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయలేకపోతే బ్యాటర్ కాదనే ధోరణి సరికాదని వ్యాఖ్య
  • స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియం వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు కేవలం 2 రోజుల్లోనే ముగిసిపోయింది. 5 సెషన్లలో మూడు ఆలౌట్లు నమోదయాయి. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కూడా 3 రోజుల్లోనే ఫలితం వచ్చేసింది. దీంతో అక్కడి పిచ్‌లపై ప్రశ్నలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా న్యూలాండ్స్ పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఇదే సమయంలో బ్యాటర్ల టెక్నిక్‌పై కూడా చర్చ మొదలైంది. బ్యాటర్ల నైపుణ్యంపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

న్యూలాండ్స్ పిచ్‌పై బ్యాటర్లు ఇబ్బంది పడడంపై స్పందిస్తూ టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్, బౌన్సీ పిచ్‌ల కంటే స్పిన్ పిచ్‌లపైనే బ్యాటర్లకు అసలైన పరీక్ష ఎదురవుతుందని అన్నాడు. ‘‘ టెస్ట్ క్రికెట్ అంటే ఆటగాళ్లను పరీక్షిస్తారు. బ్యాటర్ల మీదకు బంతులు దూసుకొచ్చే పిచ్‌లపై ఆడలేకపోతే బ్యాటర్ కాదనే ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) మీడియా వైఖరి ఈ విధంగా ఉంటుంది. ఫాస్ట్, బౌన్సీ పిచ్‌లపై ఆడలేకపోతే బ్యాట్స్‌మెన్ కాదని భావిస్తుంటారు. అయితే బంతి టర్న్ అయ్యే పిచ్‌పై ఆడలేకపోతే బ్యాటర్ కాదని నేను భావిస్తున్నాను. అదే నమ్మాను’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. 

పిచ్‌ల విషయంలో మీడియా వాస్తవాలు మాట్లాడాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. తెలిసిన వాస్తవాల గురించి మాట్లాడాలని సూచించాడు. ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదని భావిస్తుంటారని, అందుకే కొంతమంది విదేశీ ఆటగాళ్ల సామర్థ్యాన్ని మీడియా ప్రశ్నించబోదని అన్నాడు. ఈ మేరకు స్టార్‌స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ ఆసక్తికరంగా మాట్లాడాడు.
Sunil Gavaskar
Cape Town Test
India vs South africa
Cricket
Team India

More Telugu News