Iran Twin Blasts: ఇరాన్ జంట పేలుళ్లు తామే జరిపామన్న ఇస్లామిక్ స్టేట్
- ఇరాన్ జనరల్ ఖాసిం సమాధి వద్ద జంట పేలుళ్లు
- 84 మంది మృత్యువాత
- ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారి ఫొటోల విడుదల
ఇరాన్లో 84 మంది మృతికి కారణమైన జంట పేలుళ్లు తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు ఒమర్ అల్ మువాహిద్, సేపుల్లా అల్ ముజాహిద్ ఫొటోలను తమ వార్తాపత్రిక అమఖ్ ద్వారా బయటపెట్టింది. అయితే, వారు ఇరానీయులా? లేదంటే, విదేశీయులా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
కెర్మన్‌లో ఇరాన్ జనరల్ ఖాసం సులేమానీ సమాధి వద్ద నివాళులర్పించేందుకు బుధవారం భారీగా తరలివచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. 2020లో అమెరికా దాడిలో సులేమానీ మృతి చెందారు. తమపై పోరాడుతూ వచ్చిన సులేమానీ మృతిని అప్పట్లో ఈ ఉగ్రవాద సంస్థ హర్షిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది.