Road Accident: ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న డీసీఎం... ఆరుగురి మృతి
- మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో ప్రమాదం
- సంతకు వచ్చిన వారిని బలిగొన్న డీసీఎం
- జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన డీసీఎం ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ విషాద సంఘటన బాలానగర్ మండల కేంద్రం చౌరస్తాలో జరిగింది. బాలానగర్‌లో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. చుట్టుపక్కల తండాలు, గ్రామాల నుంచి చాలామంది సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసిన కొంతమంది ఓ ఆటోలో తమ గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొట్టింది.
మృతులను బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. ప్రమాద ఘటన అక్కడున్న వారినందరినీ కంటతడి పెట్టించింది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల వెళుతున్న డీసీఎం... ఆటోను ఢీకొట్టింది. ఆరుగురి మృతికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పు పెట్టారు. ఇది 44వ నెంబర్ జాతీయ రహదారి. డీసీఎంకు నిప్పు పెట్టి.. ఆందోళన వ్యక్తం చేయడంతో ఇరువైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.