Abhayahastam: ప్రజాపాలన దరఖాస్తులకు నేడే చివరి రోజు
- ప్రజాపాలనకు భారీ స్పందన
- నేడు మిస్సైతే తహసీల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుకు అవకాశం
- దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశాలు
- ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28న ఈ కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకుంటున్నారు.
తొలి రోజు నుంచే ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీ మినహా ఇప్పటివరకూ ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది.
శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. దీంతో, మొత్తం 1,08,94,115 దరఖాస్తులు అందాయి. అభయ హస్తంకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15, 55,704 అప్లికేషన్లు వచ్చాయి. చివరి రోజైన శనివారం కూడా భారీగా అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటూ రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజలు వినతి పత్రాలు అందిస్తున్నారు.
కాగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇక గ్రామసభల్లో దరఖాస్తులు ఇవ్వలేని వారు తహసీల్దారు, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తులకు సంబంధించి డాటా ఎంట్రీని ఈ నెల 17 లోగా పూర్తి చేయాలని సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు.