Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో తాంత్రికుడి గొలుసు దెబ్బలు తాళలేక మహిళ మృతి

Madhya Pradesh woman died after beaten by a tantrik

  • పెళ్లయ్యి 15 ఏళ్లయినా పిల్లలు పుట్టడంలేదని మహిళను భూతవైద్యుడి దగ్గరకి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు
  • దెయ్యం పట్టిందంటూ వరుసగా మూడు రోజులపాటు కొట్టిన తాంత్రికుడు
  • కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే కన్నుమూసిన మహిళ

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఝబువా జిల్లాలో ఓ తాంత్రికుడి ఇనుప గొలుసు దెబ్బలు తాళలేక 34 ఏళ్ల మహిళ చనిపోయింది. జిల్లాలోని నాగన్‌వత్ గ్రామానికి చెందిన మంజిత అనే మహిళకు పెళ్లయ్యి 15 ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓ తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. తంత్ర ప్రక్రియలో భాగంగా అతడు వరుసగా మూడు రోజులపాటు మంజితను కొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో బుధవారం మృతి చెందింది. 

కాగా మంజితకు 15 ఏళ్ల క్రితం ప్రకాష్ దామోర్‌ అనే వ్యక్తితో పెళ్లయ్యింది. ఎంతకీ ఆమెకు సంతానం కలగకపోవడంతో అత్తమామలు, తల్లిదండ్రులు తమ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లారు. ఆమెకు దెయ్యం పట్టిందంటూ తాంత్రికుడు భూతవైద్యం మొదలుపెట్టాడు. తంత్ర ప్రక్రియలో భాగంగా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక మూడవ రోజు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేలోగానే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ మరణానికి గల స్పష్టమైన కారణం తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఝబువా ఎస్పీ అగమ్ జైన్ తెలిపారు.

  • Loading...

More Telugu News