Kadiam Srihari: కాంగ్రెస్ సంక్షేమ పథకాలు పెంచుతుందని భావించారు కానీ..: కడియం శ్రీహరి
- ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని చెప్పారన్న కడియం
- కానీ అలా జరగడం లేదని విమర్శలు
- గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశారని ఆగ్రహం
- దళితబంధు నిధులు కూడా ఆపినట్లు తెలిసిందన్న కడియం శ్రీహరి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు పెంచుతుందని అందరూ భావించారని, కానీ కోత పెడుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెప్పారని... కానీ అలా జరగడం లేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేసే ఆలోచన చేస్తోందని ఆరోపించారు.
ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ రద్దు చేసిందన్నారు. గత ప్రభుత్వం లబ్దిదారులను ఎంపిక చేసి అనుమతి పత్రాలను కూడా అందించిందని... కానీ ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకం రద్దు వల్ల చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను, ఇప్పుడు కేటాయించాలని డిమాండ్ చేశారు.
దళితబంధుకు కూడా నిధులు ఆపినట్లు తెలిసిందన్నారు. రైతుబంధు ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేదాకా కాలయాపన చేయాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. ఫార్మా సిటీ రద్దు ప్రకటనతో భూముల ధరలు పడిపోయాయన్నారు. మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. నమ్మి ఓటు వేసిన యువతకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందన్నారు.