Revanth Reddy: ఆ పొజిషన్‌కు వెళతావు.. కానీ దూకుడు తగ్గించుకోమని మాజీ గవర్నర్ నరసింహన్ గతంలో చెప్పారు: రేవంత్ రెడ్డి
- ఈ రోజు నరసింహన్ తన వద్దకు వస్తే ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పిన రేవంత్ రెడ్డి
- ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్య
- కోదండరాంకు ఎమ్మెల్సీ ఇస్తామన్న రేవంత్ రెడ్డి
"నువ్వు కచ్చితంగా మంచి పొజిషన్‌కు వెళతావు.. కానీ కాస్త దూకుడు తగ్గించు" అని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో తనకు సూచించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలో తాను మంచి స్థానానికి వెళతానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఈఎస్ఎల్ నరసింహన్ తన వద్దకు వచ్చారని... ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. మాజీ గవర్నర్ నరసింహన్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆశీర్వాదం కూడా తీసుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
కోదండరాం సహా వారికి పదవులు ఇవ్వాల్సి ఉంది
ఎన్నికల సమయంలో సహకరించిన ఎంతోమంది నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని... వారందరికీ న్యాయం చేస్తామన్నారు. కోదండరాంకు త్వరలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సహకరించినందుకు వారి పార్టీకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. అలాగే తమ పార్టీలోని సీనియర్ నాయకులకు, పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్ నాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసింది... ఇక నేనే బాకీ ఉన్నాను
కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వాల్సినదంతా ఇచ్చేసిందని... ఇక తానే పార్టీకి బాకీ ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మోడల్ అని మా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేలా పని చేస్తానన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. ఏవైనా పొరపాట్లు జరిగితే... ఎలాంటి భేషజాలకు పోకుండా సరిచేసుకునే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.