Rohit Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన ఆలస్యానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై డైలమానే కారణమా?
- ఆఫ్ఘనిస్థాన్‌తో మరో నాలుగు రోజుల్లో మొదటి టీ20 మ్యాచ్.. ఇంకా జట్టుని ప్రకటించని బీసీసీఐ సెలక్టర్లు
- రోహిత్, కోహ్లీల ఎంపికపై డైలమానే కారణమంటూ విశ్లేషణలు
- వీరిద్దరినీ ఎంపిక చేస్తే జట్టు సమతుల్యత దెబ్బతింటుందని విశ్లేషిస్తున్న ఓ మాజీ సెలక్టర్
జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేస్తారా లేదా? అనే సందేహాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టుని ఇంకా ప్రకటించకపోవడంతో వీరిద్దరి ఎంపికపై సెలక్టర్ల డైలమానే కారణమనే టాక్ వినిపిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనున్న జట్టులో రోహిత్, కోహ్లీలకు చోటివ్వడం జాతీయ సెలెక్టర్‌లకు అంత సులభం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వీరిద్దరికీ ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ ఆడేందుకు అవకాశం కల్పించినా ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే టీ20 ప్రపంచ కప్ జట్టులో అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మేరకు బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అసలు రోహిత్, కోహ్లీలకు టీ20 వరల్డ్ కప్ ఆడే ఉద్దేశం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జాతీయ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్లి మరీ ఇద్దరితో మాట్లాడారు. ఇద్దరూ అందుబాటులో ఉండడం ఖాయమైంది. అయినప్పటికీ వీరిద్దరిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవాలంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, బీసీసీఐ కార్యదర్శి జే షా నిర్ణయించాల్సి రావొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. జనవరి 11న మొదలుకానున్న ఈ సిరీస్‌కు ఇంకా జట్టుని ప్రకటించలేదు. విదేశాల్లో ఉన్న చీఫ్ సెలక్టర్ అగార్కర్ భారత్ బయలుదేరాడని, అతడు వచ్చాక ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
రోహిత్, కోహ్లీ ఇద్దరికీ చోటు కల్పిస్తే జట్టు సమతుల్యత దెబ్బతినే అవకాశం కనిపిస్తోందని మాజీ సెలక్టర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘‘రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మొదటి ఐదు స్థానాల్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఎక్కడ ఉంటాడు?. కోహ్లీని డ్రాప్ చేసి రోహిత్ - యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించి.. గిల్‌ని 3వ స్థానంలో బ్యాటింగ్ చేయించాలి. అజిత్ అగార్కర్ అలా చేయగలరా. అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలరా’’ అని ఓ మాజీ సెలక్టర్ అభిప్రాయపడ్డారు. రోహిత్, కోహ్లిలను జట్టులోకి తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్‌లను పక్కన పెట్టాల్సి ఉంటుందని విశ్లేషించారు. దిగ్గజాలు ఇద్దరికీ ఛాన్స్ ఇస్తే రింకూ సింగ్, జితేష్ శర్మలు కీపర్ పాత్ర పోషించాల్సి ఉంటుందని, ఇక హార్దిక్ పాండ్యా ప్రతి మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. మరి బీసీసీఐ సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.