Jagan: నందికొట్కూరు ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు!
- వైసీపీలో నియోజకవర్గాల మార్పుపై కసరత్తులు
- నేతలను సీఎంవోకు పిలిపించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి
- మంత్రులకు సైతం స్థానచలనం!
వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు కసరత్తులు కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జిలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలో, నందికొట్కూరు ప్రస్తుత ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సిద్ధార్థ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని సిద్ధార్థ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. నందికొట్కూరు ఎస్సీ స్థానం కాగా, ఈసారి కొత్త అభ్యర్థి ఎంపికపై సీఎం జగన్... బైరెడ్డితో చర్చించారు.
అటు, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నియామకంపైనా సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డితో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఇక, ఉత్తరాంధ్రలో విజయనగరం లోక్ సభ ఇన్చార్జి నియామకంపైనా సీఎం జగన్ దృష్టి సారించారు. ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తో సీఎం జగన్ మాట్లాడారు. ఈ భేటీలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గ ఇన్చార్జి అంశంలోనూ సీఎం జగన్ కసరత్తు షురూ చేశారు. బుగ్గనను నేడు సీఎంవోకు పిలిపించారు. గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి నియామకం వ్యవహారంలో ఎమ్మెల్యే వరప్రసాద్ ను కూడా సీఎం జగన్ పిలిపించారు. ఇన్చార్జి విషయమై ఆయనతో మాట్లాడుతున్నారు. నందిగామ ఇన్చార్జి అంశంలో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ను పిలిపించి మాట్లాడుతున్నారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఇవాళ సీఎంవో వద్ద కనిపించారు. తాడేపల్లిగూడెం ఇన్చార్జి వ్యవహారంపై సీఎం జగన్ కసరత్తు చేస్తుండడంతో, కొట్టు సత్యనారాయణను సీఎంవోకు పిలిపించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మరోసారి సీఎంవోకు రావడం చర్చనీయాంశంగా మారింది. మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతున్నారు.