K Kavitha: 2019లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేతల వైఖరే కారణం: కల్వకుంట్ల కవిత
- కేసీఆర్ నిజామాబాద్ కు వచ్చినప్పుడు కార్యకర్తలను స్థానిక నేతలు కలవనీయలేదన్న కవిత
- తాను పర్యటించినప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్య
- తనను ఎరైనా కలవొచ్చన్న కవిత
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమీక్షలను నిర్వహిస్తూ గత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శించారు.
తాజాగా, నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడుతూ... 2019లో తాను ఓటమిపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరే కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని... ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.