White House: వీడెవడో గానీ వైట్ హౌస్ గేటునే గుద్దేశాడు!
- అమెరికా రాజధాని వాషింగ్టన్ లో ఘటన
- తన వాహనంతో వైట్ హౌస్ గేటును ఢీకొట్టిన వ్యక్తి
- డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న వాషింగ్టన్ పోలీసులు
- ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అంటే ప్రపంచంలోనే అత్యధిక భద్రత ఉండే ప్రదేశం. ఇక్కడ అడుగడుగునా పహారా ఉంటుంది. డేగ కళ్లతో ప్రతి అణువును నిశితంగా నిఘా వేసే అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలు... రెప్పపాటులో స్పందించే సుశిక్షితులైన కమాండోలు, పైకి ఏమీ ఎరగనట్టు కనిపించే సీక్రెట్ ఏజెంట్లతో వైట్ హౌస్ దాదాపు శత్రు దుర్భేద్యం అని చెప్పవచ్చు. అలాంటి శ్వేతసౌధం వద్ద ఆసక్తికర సంఘటన జరిగింది.
వాషింగ్టన్ లో ఓ వ్యక్తి తన వాహనంతో వైట్ హౌస్ కాంప్లెక్స్ గేటును గుద్దేశాడు. వెంటనే స్పందించి వాషింగ్టన్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అది యాక్సిడెంటా, లేక ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి ఘటనా అనేది తేలాల్సి ఉంది.
ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో లేరు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం అధికార ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి వెల్లడించారు.
సదరు వాహనం వైట్ హౌస్ గేటును ఢీకొన్న నేపథ్యంలో, ట్రాఫిక్ జాం ఏర్పడింది. గత నెలలోనూ ఓ వ్యక్తి తప్పతాగి తన వాహనంతో బైడెన్ కాన్వాయ్ ను ఢీకొట్టాడు.