NTR: ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం ఫొటో పంచుకున్న చంద్రబాబు

Chandrababu shares NTR oath taking ceremony pic

  • 1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం
  • ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎన్టీఆర్
  • తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారన్న చంద్రబాబు
  • ఎన్టీఆర్ స్ఫూర్తిగా మహోదయం కోసం ఉద్యమిద్దాం అని పిలుపు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక ప్రభంజనం. ఆ వెంటనే ఎన్నికల్లో నెగ్గడం ఒక చరిత్ర. ఈ ఘనతలను సాధ్యం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. చలనచిత్ర కథానాయకుడిగా విశ్వవిఖ్యాతి పొందిన ఆయన... ఎన్టీఆర్ గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిష్ఠించారు. 

దీనికి సంబంధించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. 

"41 ఏళ్ల క్రితం 1983లో ఇదే రోజున నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. ఆ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగు జాతి విముక్తిని పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఎన్టీఆర్ 1983లో టీడీపీని గెలిపించుకుని సీఎం అయ్యే సమయానికి చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు... టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చంద్రబాబు... ఎన్టీఆర్ ప్రభంజనం కారణంగానే ఓ సామాన్య అభ్యర్థి చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News