Lakshadweep: భూతల స్వర్గం లక్షద్వీప్‌ను ఎలా సందర్శించాలంటే..!

How Lakshadweep is better than Maldives for tourists

  • మాల్దీవ్స్ పుణ్యమా అని వెలుగులోకి లక్షద్వీప్‌ పర్యాటకం
  • ప్రకృతి అందాలతో అలరారే లక్షద్వీప్
  • మిగిలింది 35 దీవులే
  • విదేశీయులకు పర్మిట్ అవసరం
  • అందుబాటులోనే విమాన సేవలు
  • కొచ్చి నుంచి బోట్‌లలోనూ వెళ్లే సౌకర్యం
  • మాన్సూన్‌లో హెలికాప్టర్ సేవలు కూడా

మనతో పెట్టుకుని మాల్దీవులు భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లక్షద్వీప్‌ను సందర్శించిన భారత ప్రధాని మోదీ పర్యాటకులు ఇకపై మాల్దీవులకు బదులు లక్షద్వీప్‌ను ఎంచుకోవాలని చెప్పడం మాల్దీవులకు కంటగింపుగా మారడం.. ఆపై ఆ దేశ మంత్రుల అనుచిత వ్యాఖ్యలు వెరసి ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’కు దారితీసింది. ఆత్మాభిమానం గల భారతీయులు మాల్దీవ్స్‌ ట్రిప్స్‌కు బైబై చెప్పేశారు. ఇకపై తమ డెస్టినేషన్ లక్షద్వీపేనని తేల్చి చెప్పారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు మాల్దీవ్స్‌కు అంత ప్రాముఖ్యం ఇవ్వడానికి గల కారణం అక్కడి ప్రకృతి అందాలే. ఇలాంటి అందాలే భారత్ సొంతమైన ద్వీపాల్లోనూ ఉన్నప్పటికీ వాటికి ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యం లభించలేదు. భారత తీరంలో ఉన్న ఉష్ణమండల అటోల్ ద్వీప సమూహాలలో ఒకటైన లక్షద్వీప్‌లో పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటి వరకు పర్యాటకానికి దూరంగా ఉన్న లక్షద్వీప్‌.. మాల్దీవ్స్ పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. మాల్దీవ్స్‌తో పోలిస్తే లక్షద్వీప్‌‌కు ఎందుకు వెళ్లాలో ఇప్పుడు చూద్దాం.

మైమరపించే సన్ కిస్స్‌డ్ బీచ్‌లు
లక్షద్వీప్.. సింపుల్‌గా చెప్పాలంటే ‘లక్ష దీవులు’ అని అర్థం. భారత తీరంలో 120 నుంచి 270 మైళ్ల వరకు విస్తరించి ఉంది. 36 ద్వీపాలతో ఇది రూపొందింది. సముద్ర కోత కారణంగా పారాలి 1 ద్వీపం మునిగిపోవడంతో ఇప్పుడు 35 మాత్రమే మిగిలాయి. పచ్చని ప్రకృతి అందాలతోపాటు ‘సన్ కిస్స్‌డ్’ బీచ్‌లకు లక్షద్వీప్‌లు ఆలవాలం. ఇక్కడి మడుగులలో సముద్ర జీవులు సమృద్ధిగా ఉన్నాయి. డైవింగ్, స్నార్కెలింగ్ ద్వారా వీక్షించి ఆ దృశ్యాలను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. 

 లక్షద్వీప్ జనాభా 65,000 
 
లక్షద్వీప్‌ను మాల్దీవులకు పొడిగింపుగా చెప్పుకోవచ్చు. 12 పగడపు దిబ్బలు, మూడు దిబ్బలు, ఐదు మునిగిన ఒడ్డులు, పది నివాస ద్వీపాలతో రూపొందిందీ ద్వీపం. లక్షద్వీప్ జనాభా 65,000.  ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, కొబ్బరి సాగు. కేరళలోని కొచ్చి నుంచి సముద్రం ద్వారా, విమానం ద్వారా కూడా చేరుకోవచ్చు. విమానంలో వెళ్లాలంటే మాత్రం అగట్టి ద్వీపానికి తొలుత చేరుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్, మే మధ్య కొన్ని బోట్లు అక్కడి ద్వీపాల మధ్య తిరుగుతూ సేవలు అందిస్తుంటాయి. మాన్సూన్ సీజన్‌లో హెలికాప్టర్ సేవలు కూడా లభిస్తాయి. లక్షద్వీప్‌ను సందర్శించాలనుకునే విదేశీ పర్యాటకులకు తొలుత ఎంట్రీ పర్మిట్ అవసరం.

అదొక్కటే మైనస్
లక్షద్వీప్‌ను సందర్శించాలనుకుంటే తొలుత లక్షద్వీప్ టూరిజం ద్వారా బుక్ చేసుకుంటే సరి. అకామిడేషన్ సహా బోల్డన్ని ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. అయితే, ఇక్కడున్న చిక్కంతా ఏంటంటే.. అకామిడేషన్ ఆప్షన్స్ పరిమితంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా రిసార్ట్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అగట్టి ఐలాండ్ బీచ్ రిసార్ట్, బంగారం ఐలాండ్ రిసార్ట్, కడమట్ ఐలాండ్ రిసార్ట్‌ తప్పక దర్శించాల్సిన ప్రదేశాలు. డైవింగ్ చేయాలనుకునే వారికి చక్కని ఆప్షన్. కయాకింగ్, ఫిషింగ్, సైలింగ్‌ వంటివాటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇస్లామిక్ కల్చర్ కనిపిస్తుంది. సంప్రదాయ కళలు, కళారూపాలకు కొదవేలేదు. కొబ్బరితో చేసిన అద్భుతమైన వంటకాలకు తోడు నోరూరించే సీఫుడ్ జిహ్వచాపల్యాన్ని పెంచుతుంది. దక్షిణాది వంటకాల ప్రభావం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News