Train Accident: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా
- తీవ్రగాయాలైన వారికి రూ.2.50 లక్షలు
- స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ.50 వేలు
- ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాఫ్తుకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశం
నాంపల్లి రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం చార్మినార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు అందజేస్తామని ఓ ప్రకటన విడుదల చేసింది. స్టేషన్ లో రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు పక్కకు ఒరిగాయని, ఒక్కసారిగా రైలు కుదుపులకు లోనవడంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
చెన్నై నుంచి నాంపల్లి చేరుకున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్.. స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఇంజన్ వెళ్లి డెడ్ ఎండ్ గోడను ఢీ కొట్టింది. దీంతో ఎస్2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించిన అధికారులు.. స్టేషన్ లో మరమ్మతు పనులను మొదలుపెట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చి మిగతా రైళ్ల రాకపోకలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా ట్రాక్ ను పునరుద్ధరించి, రైళ్లను యథావిధిగా నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు వివరించారు.