Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పై మరికాసేపట్లో తీర్పు

AP High Court Will Deliver Its Verdict On Chandrababu Bail Petitions

  • ఐఆర్ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
  • సుదీర్ఘ వాదనల పూర్తి.. తీర్పు వెల్లడి మధ్యాహ్నానానికి వాయిదా
  • మధ్యాహ్నం 2:15 గంటలకు తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పుతో పాటు ఇసుక కేసు, మద్యం కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై సుదీర్ఘ విచారణలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అసలు లేని, ఇప్పటి వరకు రాని ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదించారు.

ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో చంద్రబాబు తన అనుయాయులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నాడన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇక ఇసుక కేసుకు సంబంధించిన ఆరోపణల విషయానికి వస్తే.. రాష్ట్రంలోని పేద, మద్య తరగతి ప్రజలకు ఉచితంగా, వేగంగా ఇసుక సరఫరా చేయాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే, ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందంటూ వైసీపీ సర్కారు ఆరోపిస్తోందని, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు నేరత్వాన్ని ఆపాదించడం సరికాదని తెలిపారు.

ఏపీలో మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తులకు ఆపాదిస్తున్నారంటూ చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా విమర్శించారు. దాదాపు నెల రోజుల క్రితమే ఈ మూడు కేసులపై వాదనలు పూర్తికాగా.. తీర్పును జస్టిస్ సి మల్లికార్జున రావు నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. తాజాగా బుధవారం ఉదయం ఈ కేసులను ప్రస్తావిస్తూ.. మధ్యాహ్నం 2:15 నిమిషాలకు తీర్పు వెలువరిస్తామని బెంచ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News