Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ స్టార్ క్రికెటర్ కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష
- మైనర్ బాలికపై అత్యాచారం కేసు
- సందీప్ లామిచానేను దోషిగా నిర్ధారించిన కోర్టు
- జైలు శిక్షతో పాటు జరిమానా
- హైకోర్టులో అప్పీల్ చేయనున్న లామిచానే
నేపాల్ క్రికెట్ జట్టులో ఎంతో ప్రతిభావంతుడిగా పేరుపొందిన స్టార్ లెగ్ స్పిన్నర్, మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో లామిచానేకు నేపాల్ లోని ఖాట్మండూ డిస్ట్రిక్ట్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఖాట్మండూలోని ఓ హోటల్ గదిలో లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 17 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో లామిచానేపై కేసు నమోదైంది. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న లామిచానేపై అప్పట్లో ఇంటర్ పోల్ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. దాంతో లామిచానే బయటికి రాక తప్పలేదు.
ఇంటర్ పోల్ సాయంతో లామిచానేను ఖాట్మండూలోని త్రిభువన్ ఎయిర్ పోర్టులో నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే అతడికి శిక్ష పడింది. అంతేకాదు, జరిమానా కింద కోర్టుకు 3 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని, బాధితురాలికి పరిహారం కింద 2 లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ప్రస్తుతం లామిచానే బెయిల్ మీద బయట ఉన్నాడు. ఖాట్మండూ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పుపై లామిచానే న్యాయవాది సరోజ్ ఘిమిరే స్పందిస్తూ... తాము హైకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు.