Indian Railways: చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరణ... ప్రమాద ఘటన ఫొటోలు ఇవిగో
- సాయంత్రానికి రైలును పునరుద్ధరించిన దక్షిణ మధ్య రైల్వే
- ఎంఎంటీఎస్ సర్వీసులకు మినహా ఏ ఇతర రైళ్లకు ఇబ్బంది కలగలేదని వెల్లడి
- ప్రమాద రైలు కోచ్‌లను టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించిన అధికారులు
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును... రైల్వే అధికారులు పునరుద్ధరించారు. బుధవారం ఉదయం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఈ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి వస్తోన్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఐదో నెంబర్ ప్లాట్ ఫామ్‌పై నేరుగా వెళ్లి చివరలో ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో ఎస్2, ఎస్3, ఎస్6 బోగీలు పట్టాలు తప్పి... పలువురికి గాయాలయ్యాయి. బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రైలు స్టేషన్‌లో ఆగేందుకు నెమ్మదిగా రావడంతో పెను ప్రమాదం తప్పింది.
సాయంత్రానికి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులకు మినహా ఏ ఇతర రైళ్లకు ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద రైలు కోచ్‌లను టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై చట్టబద్ధమైన విచారణ నిర్వహిస్తామని తెలిపారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.