Devineni Uma: ఎంపీ పదవి కోసం ఇంతగా దిగజారాలా నానీ?: దేవినేని ఉమా
- సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని
- ప్రెస్ మీట్ లో చంద్రబాబుపై విమర్శలు
- దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా అంటూ ఉమా ఆగ్రహం
- నీవెంట ఒక్క టీడీపీ కార్యకర్త కూడా రారని స్పష్టీకరణ
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిసిన అనంతరం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి కేశినేని నానీని తీవ్రంగా విమర్శించారు. రెండు సార్లు ఎంపీగా గెలిపించిన టీడీపీని, రాజకీయంగా పైకి తీసుకొచ్చిన చంద్రబాబుని కాదని దుర్మార్గుడి పంచన చేరి దుర్భాషలాడతావా? అంటూ మండిపడ్డారు.
నాని తన ట్రావెల్స్ వ్యాపారం వదులుకోవడానికి కారణం నష్టాలు రావడం వల్లే... ఆ నష్టాలు భర్తీ చేసుకోవడానికే ఆస్తులు అమ్ముకున్నాడు అని ఉమా స్పష్టం చేశారు. చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తామంతా పార్టీ కోసం మౌనంగా అవమానాలు భరిస్తే, నాని మాత్రం ప్రోటోకాల్ పిచ్చితో ఇష్టానుసారం ప్రవర్తించాడని విమర్శించారు.
లోకేశ్ పాదయాత్రతో యువతలో చైతన్యం వచ్చి నేడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సభలకు యువత కదిలివస్తుంటే నానీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, దెబ్బతిన్న బెబ్బులిలా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలోనే తిరిగి, చివరకు కరకట్ట కమల్ హాసన్ ఓటమి భయంతో రాజీనామా చేసేలా చేశాడని అన్నారు.
2019 ఎన్నికల్లో నానీ గెలుపుకోసం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ అభ్యర్థులతో పాటు, పార్టీనే డబ్బు ఖర్చుపెట్టింది తప్ప, నానీ రూపాయి పెట్టలేదు. టీడీపీ కార్యకర్తల స్వేదం.. రెక్కల కష్టం వల్లే నాకైనా... నానీకైనా పదవులు దక్కాయి. నానీ గానీ, నేను గానీ మా చర్మం వలిచి చెప్పులు కుట్టించి టీడీపీకి ఇచ్చినా ఆ రుణం తీరదు.
నిన్నటి వరకు ఆహా, ఓహో అన్న నోటికి ఇప్పుడు మేం చెడ్డవాళ్లమైపోయామా? ఎంతమంది టీడీపీ కార్యకర్తల రెక్కల కష్టంతో తాను రెండుసార్లు ఎంపీగా గెలిచాడో నాని మర్చిపోయినా... మా పార్టీ మర్చిపోలేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీని ఏ విధంగా నాని విమర్శించాడో తెలుసు.
రాజమహేంద్రవరంలో మహానాడు జరిగినప్పుడు కూడా ఢిల్లీలో కూర్చున్నాడు. ఈనాడు ఎంపీ హోదాలో నానీ అనుభవిస్తున్న ప్రొటోకాల్, ఇతర భోగాలన్నీ టీడీపీ కార్యకర్తల కష్టం వల్ల వచ్చినవేనని నాని గుర్తించాలి. నేను నాలుగుసార్లు గెలిచినా అది కార్యకర్తల వల్లే. చంద్రబాబు ఇచ్చిన బీఫామ్, ఆయన నాయకత్వం వల్లే మనం నాయకులం అయ్యాం.