Kadiam Srihari: రేవంత్ రెడ్డి పార్టీ సమావేశాలను అక్కడ ఎలా పెడతారు?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం
- ప్రగతి భవన్లో రాజకీయ కార్యక్రమాలు పెడతారా? అని రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టారన్న కడియం
- దళితబంధుపై ప్రభుత్వ వైఖరి ఏమిటో మల్లు భట్టి చెప్పాలని డిమాండ్
- ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శ
- భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం
సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ సమావేశాలని ఎంసీహెచ్ఆర్డీలో ఎలా పెడతారు? ప్రగతి భవన్లో రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారని గతంలో ఆయన గగ్గోలు పెట్టలేదా? అని స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు... పథకాల అమలు తేదీలను కూడా ప్రకటించారని విమర్శించారు. కానీ ఇప్పుడు జాప్యం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన దళితబంధుపై ప్రభుత్వ వైఖరి ఏమిటో... డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని అధికార పార్టీ రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు అసాధ్యమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తాము ప్రజల పక్షాన కొట్లాడుతామన్నారు. ఉద్యమాలు తమ పార్టీకి కొత్త కాదన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు.
ఫార్ములా ఈ-రేస్ హైదరాబాద్లో జరిగితే ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చని తాము భావించామని... కాబట్టి ఒప్పందంలో ఏమైనా తప్పులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని సూచించారు. 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు. చిన్న చిన్న లోపాలతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి గెలుపొందడం ఖాయమన్నారు.