Mudragada Padmanabham: రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న ముద్రగడ.. త్వరలోనే జనసేన గూటికి?

Kapu leader Mudragada Padmanabham reactivate in politics join in Janasena

  • ముద్రగడను ఆయన ఇంటికి వెళ్లి కలిసిన జనసేన, కాపు జేఏసీ నేతలు
  • త్వరలోనే జనసేనానిని కలవనున్న ముద్రగడ
  • కలయికపై పెదవి విప్పని ముద్రగడ కుటుంబం

ఎన్నికలకు రెడీ అవుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాజకీయంగా వరుస పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ నుంచి వలసలు ఇప్పటికే ప్రారంభం కాగా, ముఖ్యనేతలందరూ సమావేశాలతో తీరికలేకుండా గడుపుతున్నారు. తాజాగా, మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని, అందులో భాగంగా జనసేనలో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఆయన పవన్‌ను కలవబోతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లిన జనసేన నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, తాతాజీ, కాపు జేఏసీ నేతలు ఆయనతో సమాలోచనలు జరిపారు. అయితే, తాము ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశామని నేతలు తెలిపారు. మరోవైపు, మరో రెండుమూడు రోజుల్లో జనసేన ముఖ్యనేతలు ముద్రగడను కలిసే అవకాశం ఉందని సమాచారం. జనసేన నేతలు తనను కలవడంపై ముద్రగడ పెదవి విప్పడం లేదు. అంతేకాదు, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయంలోనూ కుటుంబ సభ్యులు మౌనం పాటిస్తున్నారు.

పవన్ లేఖ ప్రభావమేనా?
ఈ నెల 4న కాపునేతలకు లేఖ రాసిన పవన్.. వారు తనను దూషించినా దీవెనల్లానే స్వీకరిస్తానని తెలిపారు. కాపులను అధికార వైసీపీ రెచ్చగొడుతోందని, ఆ కుట్రలో పావులుగా మారొద్దని విజ్ఞప్తి చేశారు. కాపునేతలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. అంతలోనే ఇప్పుడు ముద్రగడతో జనసేన నేతలు సమావేశం కావడం, ఆయన కూడా త్వరలోనే పవన్‌ను కలుస్తారన్న సమాచారం నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి.

  • Loading...

More Telugu News