BRS: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్.. పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన కడియం

BRS will change its name back to TRS
  • పేరులోంచి తెలంగాణను తొలగించడం వల్ల ప్రజలకు దూరమైందన్న భావన
  • తిరిగి టీఆర్ఎస్‌గా మారడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ఆలోచన
  • కేటీఆర్‌కు సూచించిన కడియం శ్రీహరి
  • మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదేనని వ్యాఖ్య
  • కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచన
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్‌గా మారబోతోందా? బీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లి బొక్కబోర్లా పడిన పార్టీ తిరిగి పూర్వపేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తోందా? ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

నిన్న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో కడియం ఈ విషయానికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని, ఒకటిరెండు శాతంమంది ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 

అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు కడియం చెప్పినట్టు సమాచారం. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే ఆ విషయాన్ని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు విడిచిపెట్టాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి చర్చించాలని కడియం సూచించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
BRS
TRS
KTR
KCR
Kadiam Srihari

More Telugu News