MLC Election: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్
- రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్న ఈసీ
- ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ
- 29 న పోలింగ్.. సాయంత్రం ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాకు చెందిన ఈ సీట్లకు ఈ నెల 29 న పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించి, 19న పరిశీలన, 22 వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా ఈ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.