harsha kumar: తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు: హర్షకుమార్
- షర్మిలపై అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవాలన్న హర్షకుమార్
- రాజ్యసభకు పంపచ్చని, దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవచ్చునని సలహా
- తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల చెప్పారన్న హర్షకుమార్
జగన్, షర్మిల ఒక్కటేనని.. అందుకే షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ పార్టీకి ఒకే విషయం చెబుతున్నానని.. షర్మిలపై ఆ పార్టీకి అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవచ్చునని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ చేసుకోవచ్చునని.. కర్ణాటక నుంచి పార్లమెంట్ సీటు లేదా రాజ్యసభకు పంపించవచ్చునని, దేశానికే స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోండని... కానీ ఏపీ బాధ్యతలు మాత్రం అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పారని.. అలాంటి నాయకురాలు ఆంధ్రాలో బాధ్యతలు చేపడితే వచ్చే పరిణామాలను గ్రహించాలని సూచించారు. అందుకే తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించవద్దన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
జగన్‌పై విమర్శలు
జగన్‌పై హర్ష కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ విద్యార్థులు సహా అందరికీ ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తే జగన్ మాత్రం అందరికీ తీసేశారని ఆరోపించారు. జగన్‌ను గద్దె దింపడానికి దళితులంతా సిద్ధమయ్యారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. దళితులకు ఒక్క కేసులోనూ న్యాయం జరగలేదన్నారు. వైసీపీ పాలనలో దళితులు నిరాదరణకు గురయ్యారన్నారు. దళితుల ఆశలపై జగన్ నీళ్లు జల్లారని విమర్శించారు.