Sachin Tendulkar: రాహుల్ ద్రావిడ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సచిన్ టెండూల్కర్.. పాత ఫొటోతో ఇంట్రెస్టింగ్ పోస్ట్
- ఆరోగ్యం, ఆనందాలతో జీవించాలని ఆకాంక్షించిన సచిన్
- ఇద్దరూ టెస్ట్ క్రికెట్ ఆడుతున్న పాత ఫొటోని పంచుకున్న ‘క్రికెట్ గాడ్‘
- నేడు 51వ వసంతంలోకి అడుగుపెట్టిన ద్రావిడ్
మాజీ దిగ్గజం, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నేడు (గురువారం) 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 50 సంవత్సరాలు నిండిన ‘ది వాల్’కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల నుంచి వర్ధమాన, మాజీ క్రికెటర్లు తమ విషెస్‌ని తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు. సోషల్ మీడియా వేదికగా ‘మిస్టర్ డిపెండబుల్’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.
‘‘ నా తోటి క్రికెటర్, స్నేహితుడు రాహుల్ ద్రవిడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశాడు. ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని సచిన్ ఆకాంక్షించాడు. ఈ ఏడాది చాలా సంతోషాన్ని, విజయాలను అందించాలని అభిలషించాడు. ఈ సందర్భంగా ఒక పాత ఫొటోని సచిన్ షేర్ చేశాడు. ఈ పిక్‌ని చూస్తే ఇద్దరూ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.
కాగా జనవరి 11న రాహుల్ ద్రావిడ్ 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రావిడ్ ప్రస్తుతం మొహాలిలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 మ్యాచ్ కోసం జట్టుతో ఉన్నాడు. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను సంసిద్ధం చేస్తున్నాడు. ఇదిలావుంచితే సమకాలీన క్రికెటర్లు అయిన సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ చాలాకాలం పాటు టీమిండియాకి ప్రాతినిధ్యం వహించారు. అద్భుతమైన భాగస్వామ్యంతో ఎన్నో వన్డేలు, టెస్టు మ్యాచ్‌లను గెలిపించారు. ఎన్నో చారిత్రాత్మకమైన భాగస్వామ్యాలను నెలకొల్పారు. ఆ రోజుల్లో నిలకడగా రాణించిన ద్రావిడ్‌పై సచిన్ తరచూ ప్రశంసల జల్లు కురిపిస్తుండేవాడు.