sajjanar: ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నారా? అయితే టీఎస్ఆర్టీసీ అలర్ట్ మీ కోసమే!
- ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వెళ్లే కొన్ని బస్సులు ఆగే స్థలాన్ని మార్చినట్లు వెల్లడించిన సజ్జనార్
- హన్మకొండ వైపుకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఉంటాయని వెల్లడి
- యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్‌లను లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలోకి మార్చినట్లు వెల్లడి
సంక్రాంతి పండుగకు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ అలర్ట్! ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి వరంగల్ దిశగా కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగే స్థలాన్ని మార్చినట్లు తెలిపింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
"సంక్రాంతికి ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి ముఖ్య గమనిక! ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్/తొర్రూర్ వైపునకు వెళ్లే బస్సులు ఆగే స్థలాలను టీఎస్ఆర్టీసీ మార్చింది. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా.. యాదగిరిగుట్ట, తొర్రూర్ బస్టాప్‌లను లిటిల్ ప్లవర్ స్కూల్ సమీపంలోకి టీఎస్ఆర్టీసీ మార్చింది. ఒక్కో బస్టాఫ్‌ను 300 మీటర్ల గ్యాప్‌తో ఏర్పాటు చేసింది. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి, ఈ సంక్రాంతికి రెగ్యులర్, స్పెషల్ బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయి. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.