Kesineni Nani: టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయి.. విజయవాడ ద్రోహి చంద్రబాబు: కేశినేని నాని
- చంద్రబాబు పొరపాటున కూడా గెలవరన్న కేశినేని నాని
- లోకేశ్ సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శ
- జగన్ తనను అక్కున చేర్చుకున్నారని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెపుతున్నాయని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని అన్నారు. జగన్ ను, తనను, దేవినేని అవినాశ్ ను గెలిపించాలని కోరారు. విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ తనను ఎంతో అవమానించిందని, మెడపట్టుకుని అవమానకరంగా గెంటేసిందని కేశినేని నాని మండిపడ్డారు. జగన్ తనను ఆప్యాయతతో అక్కున చేర్చుకుని, ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, మరో ఓల్డ్ సిటీ చేయాలనుకున్నారని విమర్శించారు. విజయవాడకు ఎయిర్ పోర్ట్ కూడా వద్దని చంద్రబాబు ఆలోచించారని అన్నారు. కుమారుడు నారా లోకేశ్ సీఎం కావాలనేదే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. లోకేశ్ కోసం పవన్ కల్యాణ్ ను కూడా చంద్రబాబు మోసం చేస్తారని అన్నారు.
అమరావతి 30 ఏళ్లయినా పూర్తి కాదని తాను ఎప్పుడో చెప్పానని నాని అన్నారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని... కాజ నుంచి కట్టి ఉంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేదని చెప్పారు. ల్యాండ్ మాఫియాకు పోకుండా... పాత అమరావతి నుంచి ప్లాన్ చేస్తే బాగుండేదని అన్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ అమరావతి రైతులను మోసం చేశారని చెప్పారు.