IAF: సముద్ర గర్భంలో ఇన్నాళ్లకు దొరికిన భారత వాయుసేన విమాన శకలాలు
- 2016 జులైలో తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ బయల్దేరిన విమానం
- విమానంలో 29 మంది
- కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయిన విమానం
- ఎనిమిదేళ్ల తర్వాత తాజాగా శకలాల గుర్తింపు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన ఓ విమానం 2016 జులై 22న ఆచూకీ లేకుండా పోయింది. చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి 29 మందితో పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ అండ్ నికోబార్ దీవులు) బయల్దేరిన ఆ విమానం బంగాళాఖాతం మీదుగా ప్రయాణిస్తూ ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ ఏఎన్-32 విమానం కూలిపోయి ఉంటుందని అప్పట్లో అంచనా వేసినా అది ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేకపోయారు.
అయితే, ఆ విమాన శకలాలను ఎనిమిదేళ్ల తర్వాత గుర్తించారు. తాజాగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ)కి చెందిన పరిశోధక బృందం సాయంతో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ భారత వాయుసేన విమాన శకలాలను కనుగొంది.
ఎన్ఐఓటీ ఓ అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ (ఏయూవీ)ని సముద్రగర్భంలోకి పంపించి శకలాల కోసం అన్వేషణ సాగించింది. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు ఉన్నట్టు ఏయూవీ గుర్తించింది. ఈ శకలాలు సముద్రంలో 3.4 కిలోమీటర్ల లోతున పడి ఉన్నట్టు వెల్లడైంది.
ఏయూవీ సేకరించిన డేటాను పరిశీలించిన ఎన్ఐఓటీ ఆ శకలాలు భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానానికి చెందినవేనని తేల్చింది. దాంతో, ఈ విమానంలోని 29 మంది మృత్యువాత పడి ఉంటారని ఓ నిర్ధారణకు వచ్చారు.