Rohit Sharma: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. సంచలన టీ20 రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శర్మ
- అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలవబోతున్న హిట్‌మ్యాన్
- ఆఫ్ఘనిస్థాన్‌పై ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో నమోదు కానున్న సంచలన రికార్డు
- 134 మ్యాచ్‌లతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్న ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్
అభిమానులు ‘హిట్‌మ్యాన్’గా పిలుచుకునే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన రికార్డుకు చేరువయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా అవతరించబోతున్నాడు. ఇందుకు మరొక్క మ్యాచ్ దూరంలోనే ఉన్నాడు. ఇప్పటికే 149 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఆప్ఘనిస్థాన్‌పై జనవరి 14 (ఆదివారం) ఆడనున్న టీ20తో 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్) - 134, జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్) - 128, షోయబ్ మాలిక్ (పాకిస్థాన్) - 124, మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) - 122 మ్యాచ్‌లతో వరుస స్థానాల్లో నిలిచారు.
కాగా దాదాపు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ తిరిగి టీ20 ఫార్మాట్ క్రికెట్ మొదలుపెట్టాడు. జూన్‌లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేశారు. వన్డే వరల్డ్ కప్‌లో వీరిద్దరూ అద్భుతంగా ఆడడంతో టీ20 వరల్డ్ కప్ కూడా ఆడించాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఈలోగా ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌తోపాటు ఐపీఎల్‌లోనూ వీరిద్దరూ సత్తాను చాటాల్సి ఉంటుందని, ఇక్కడి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.