Ramcharan: రామ్ చరణ్, ఉపాసనలకు అయోధ్య రామ మందిరం ఆహ్వానం
- రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్
- చరణ్ దంపతులను ఆహ్వానించిన ఆరెస్సెస్ నేత
- ఈ నెల 22న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం
అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో రజనీకాంత్, అజయ్ దేవగణ్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, అలియా భట్, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమానికి మొత్తం 8 వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మితమయింది.