Mallikarjun Kharge: 'ఇండియా' కూటమి రథ సారథిగా మల్లికార్జున ఖర్గే!
- మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు
- కీలక సమావేశం నిర్వహించిన ఇండియా కూటమి పెద్దలు
- కన్వీనర్ పదవిని నితీశ్ కుమార్ కు ఇస్తామన్న నేతలు
- తిరస్కరించిన నితీశ్ కుమార్
ఏప్రిల్ లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పెద్దలు నేడు సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇండియా కూటమి అధినేత పదవికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా చివరి వరకు రేసులో నిలిచినప్పటికీ నిరాశ తప్పలేదు. నితీశ్ కు కూటమి కన్వీనర్ పదవిని ప్రతిపాదించగా, ఆయన అందుకు అంగీకరించలేదని సమాచారం. అధ్యక్ష పదవిని కాంగ్రెస్ వారికే ఇచ్చారు కాబట్టి, కన్వీనర్ పదవిని కూడా కాంగ్రెస్ వారికే ఇవ్వాలని నితీశ్ పేర్కొన్నట్టు తెలిసింది.
ఇవాళ వర్చువల్ గా జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.