sajjanar: రామమందిరం పేరుతో మీకు వాట్సాప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్ హెచ్చరిక
- అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టిక్కెట్ల పేరుతో సైబర్ నేరాళ్ల మోసం
- ఏపీకే ఫైల్‌ను డౌల్ లోడ్ చేసుకోమని సందేశం వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచన
- ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ డేటాను దోచుకుంటారన్న సజ్జనార్
సైబర్ నేరగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కొట్టేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోరు. ప్రజలకు ఆసక్తిని కలిగించే ఏ అంశం అయినా దోచుకోవడానికి మార్గంగా ఎంచుకుంటారు. ఇప్పుడు అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై వాళ్ల దృష్టిపడింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభం కానుంది.
దీంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి వీఐపీ టిక్కెట్ల పేరుతో వాట్సాప్‌కు ఏపీకే ఫైల్‌ను పంపిస్తున్నారు. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే... దీనిపై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తస్కరణకు గురయ్యే అవకాశముంది. దీనికి సంబంధించి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
"'అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్ కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఈ ఏపీకే ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోండి' అని మీకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసినా.. ఇక అంతే! మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడుతారు" అంటూ సజ్జనార్ హెచ్చరిక ట్వీట్ చేశారు.