Narendra Modi: జర్మనీ యువ గాయనిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
- జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం
- రాముడ్ని స్తుతిస్తూ భక్తిగీతం ఆలపించిన జర్మనీ సింగర్ కసాండ్రా
- ఆమె పాట అందరినీ సంతోషానికి గురిచేస్తుందన్న ప్రధాని మోదీ
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి చెందిన ఓ యువ గాయనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ గాయని పేరు కసాండ్రా మే స్పిట్ మాన్. శ్రీరాముడ్ని స్తుతిస్తూ ఆమె ఆలపించిన భక్తి గీతం మోదీని విశేషంగా ఆకట్టుకుంది. కసాండ్రా పాడిన పాట తాలూకు వీడియోను మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు.
"యావత్ ప్రపంచం జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది. జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్ మాన్ గురించి నేను గతంలో మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించాను. ఇప్పుడామె ఆలపించిన ఈ కీర్తన మిమ్మల్ని చాలా సంతోషానికి గురిచేస్తుంది" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కాగా, ఈ వీడియోను గాయని కసాండ్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మూడ్రోజుల కిందట పోస్టు చేయగా, నెటిజెన్ల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 55 వేల వీక్షణలు, 12 వేల కామెంట్లు వచ్చాయి.