Narayana Murthy: విప్రోలో ఉద్యోగం కోసం వెళితే నన్ను తీసుకోలేదు: నారాయణ మూర్తి

Narayana Murthy Wanted Job Application Was Rejected By Azim Premji

  • కెరీర్ ప్రారంభంలో జరిగిన విషయాన్ని వెల్లడించిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్
  • ఆ తర్వాతి కాలంలో అదే సంస్థతో పోటీ పడి గెలిచామన్న నారాయణ మూర్తి
  • అప్పట్లో తనకు ఉద్యోగం ఇవ్వకపోవడం భారీ తప్పిదమని అజీమ్ ప్రేమ్ జీ చెప్పినట్లు వెల్లడి

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఉద్యోగం కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రముఖ కంపెనీ విప్రో తిరస్కరించిందట.. అప్పుడు నారాయణ మూర్తికి ఉద్యోగం ఇవ్వకపోవడం తను చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటని విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ చెప్పారట. ఈ విషయాన్ని నారాయణ మూర్తి తాజాగా వెల్లడించారు. తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఈ విషయాన్ని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. విప్రోలో ఉద్యోగానికి వెళ్లి తిరస్కరణకు గురైన తాను.. ఆ తర్వాతి కాలంలో అదే సంస్థకు గట్టి పోటీదారుగా నిలిచానని వివరించారు. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ కంపెనీ ప్రస్తుతం విప్రోకు అందనంత ఎత్తులో ఉంది. తాజా గణాంకాల ప్రకారం (2024 జనవరి).. విప్రో నెట్ వర్త్ రూ.2.43 లక్షల కోట్లు కాగా ఇన్ఫోసిస్ కంపెనీ నెట్ వర్త్ రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది.

విప్రోలో ఉద్యోగం వచ్చి ఉంటే తన పరిస్థితి మరోలా ఉండేదని నారాయణ మూర్తి చెప్పారు. ఆ ఉద్యోగం రాకపోవడంతో తర్వాతి కాలంలో స్నేహితులతో కలిసి ఇన్ఫోసిస్ ను ప్రారంభించడం జరిగిందని వివరించారు. తన భార్య సుధా మూర్తి వద్ద రూ.10 వేలు తీసుకుని ఇన్ఫోసిస్ కంపెనీని ప్రారంభించినట్లు తెలిపారు. 1981లో స్థాపించిన ఈ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుత స్థితికి చేరిందని వివరించారు. దాదాపుగా అదే సమయంలో విప్రో కూడా ఐటీ రంగంలోకి ప్రవేశించినా తమతో పోటీ పడలేక పోయిందని చెప్పారు. వ్యాపారపరంగా అజీమ్ ప్రేమ్ జీ, తాను చాలాసార్లు కలుసుకున్నామని నారాయణ మూర్తి చెప్పారు. ఓ సందర్భంలో అజీమ్ ప్రేమ్ జీ తనతో మాట్లాడుతూ.. ‘అప్పట్లో నిన్ను ఉద్యోగంలోకి తీసుకోకపోవడం నేను చేసిన అతిపెద్ద తప్పిదాలలో ఒకటి’ అని ఆయన చెప్పారన్నారు.

  • Loading...

More Telugu News